ఎలాంటి వివాదం లేని శంకర్ పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీచేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని కోర్టు జీవన్ రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన అక్రమ కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, ఎస్ నిరంజన్ రెడ్డి, మహపూజ్ నజకీ ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదిలావుండగా అత్యున్నత న్యాయస్థానం తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తనను దెబ్బతీసేందుకు పెట్టిస్తున్న అక్రమ కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.