
ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ధర్పల్లి మండలంలోని రేకులపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సిరికొండ ధర్పల్లి మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టీయుసిఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతు పిలుపునిచ్చారు. గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రమేష్ అధ్యక్షత వహించి మాట్లాడాగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు బి. కిశోర్, ఎల్. నరేష్, ఎస్. కిశోర్, రాంచందర్, జాను,రవి తదితరులు పాల్గొన్నారు.