
నిజామాబాద్, మే 20 : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం కింద దాఖలైన దరఖాస్తులను నిశితంగా పరిశీలన జరుపుతూ, పక్కాగా క్షేత్రస్థాయి విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మెండోరా మండలంలోని అన్ని గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులు, ప్రజల నుండి భూ సంబంధిత అంశాలపై అర్జీలు స్వీకరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చిన అర్జీలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియ తీరును కలెక్టర్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్, దూదిగాంలను సందర్శించి, ఫీల్డ్ ఎంక్వయిరీ జరుపుతున్న విధానాన్ని నిశిత పరిశీలన జరిపారు. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న క్రమంలో దరఖాస్తుదారులు స్థానికంగా ఉన్నారా, లేదా అన్నది గమనించారు. అర్జీదారులతో భేటీ అయ్యి వారు ఏ అంశాలపై దరఖాస్తులు చేసుకున్నారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. రెవెన్యూ బృందాలు క్షేత్ర విచారణ సందర్భంగా పరిశీలిస్తున్న అంశాల గురించి వారిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, భూ భారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మెండోరా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న డెస్క్ వర్క్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులోని వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినందున ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా డెస్క్ వర్క్, ఫీల్డ్ వెరిఫికేషన్ లను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్లు శ్రీకాంత్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.