
జయ్ న్యూస్, హైదరాబాద్ మే26:- రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను గాలికొదిలేయడం వల్ల తెలంగాణ రైతులు ఆగమాగమవుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం వానలకు తడిసి ముద్దవుతున్న దృశ్యాలే కనిపిస్తు న్నాయని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమ నీటిపాలై అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయని, అప్పుల ఊబిలో కూరుకు పోతూ వారికి భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. రైతులు కన్నీరుమున్నీరవు తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్తంతా కనికరం కూడా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని రాసి రంపాన పెడుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచాయన్నారు. మామిడి పంటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పంట కండ్ల ముందే నీటి పాలు అవ్వడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 70% వరకు వడ్లు రాలిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క కోసిన పంట కల్లాల్లో నీటిలో మునిగి పోయింది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు పూర్తిగా రాలి పోయాయి.. నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం వరికుప్పలు పూర్తిగా నీటిపాల య్యాయి అని జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి, వేల్పూర్, ఆర్మూర్, నందీపేట్, డిచ్పల్లి, బీంగల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి గ్రామీణ, ఎల్లారెడ్డి, దోమకొండ బిక్కనూరు, నాగిరెడ్డిపేట్ బాన్సువాడ, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం పడడంతో పంటలు పూర్తిగా గింజ రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలిపోయిందని ఆయా మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదని, గన్నీ బ్యాగులకు దిక్కులేదు, ధాన్యం తరలించడానికి లారీలు లేవని, అధికారులు ముఖం చాటేశారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని లేదంటే తమకు చావే శరణ్యమని రైతులు గగ్గోలు పెడుతున్నా వారి గోస పట్టించుకునే నాధుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజులు అయినా కొనుగోళ్లు పూర్తి కాకపోవడం సిగ్గు చేటని, రూ.500 సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినా ఇప్పటికి వరకూ ఒక్క రైతుకు బోనస్ అందలేదని ఆయన పేర్కొంటూ అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు పై సీఎం ఒక్కసారి కూడా రివ్యూ పెట్టలేదు. అందాల పోటీల కోసం పదిసార్లు రివ్యూ పెట్టిండు అని ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు స్వర్ణయుగమని ఆయన అభివర్ణించారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయ రంగం మళ్ళీ చీకట్లు అలుముకుంటు న్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.