
జయ్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బాల, బాలికల 12 ఇంటర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు మూసివేతను విరమించుకోవాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, 1985 సంవత్సరం నుండి నేటి వరకు ఇంగ్లీష్ మీడియం లో దళిత విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఎన్నో అవకాశాలు అందించడం జరిగిందన్నారు. కానీ నేటి కాంగ్రెస్ హయాంలో 12 సాంఘిక సంక్షేమ బాల, బాలికల గురుకుల కళాశాల ఇంటర్ విద్యను దళిత విద్యార్థులకు దూరం చేయడం దుర్మార్గమన్నారు. ఈ 12 గురుకులాలలో నాలుగు బాలురకు సంబంధించినవి ఎనిమిది బాలికలకు సంబంధించిన గురుకులాలు ఉన్నవన్నారు. 12 గురుకులాలు మూసివేత వలన ఒక్కో గురుకులంలో 160 మంది చొప్పున విద్యార్థులు దాదాపు 2000 మంది విద్యార్థులు తమ విద్యను దూరం చేసుకుని అవకాశం ఉన్నదన్నారు. భవిష్యత్తులో దాదాపు 200 ఉద్యోగాలు నిరుద్యోగులకు దూరమయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఈ విధంగా దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవరించడం సిగ్గుచేటన్నారు. ఇదేనా తెలంగాణ దళిత విద్యార్థులు కలలుగన్న విద్యను దూరం చేయడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన కళాశాల మూసివేత విరమించుకుని రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమించాలని,విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు సృజన్, నాగేష్,సంతోష్, సాయి లతో తదితరులు పాల్గొన్నారు.