
జయ్ న్యూస్, నిజామాబాద్: గురువారం తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున్న నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్ ఫార్మ్ ను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు పక్కా ఆధారాలతో ఇవ్వడం జరిగిందని TGVP జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లా విద్యాధికారి (DEO) గానీ, మండల విద్యాధికారి (MEO) గానీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వారు స్పష్టంగా తెలియజేశారు. అయితే అనుమతులు లేని స్థితిలో కూడా పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు దురుద్దేశ్యంతో అర్థంలేని హామీలతో అడ్మిషన్ ఫారాలు ఇచ్చి, ఇప్పటివరకు 400కు పైగా అడ్మిషన్లు చేపట్టారు. ఇది పూర్తిగా విద్యా నియమావళికి విరుద్ధమని, ఈ అక్రమ అడ్మిషన్స్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అడ్మిషన్ తీసుకున్న తల్లిదండ్రులకు వెంటనే వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, అనుమతులు లేని పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద సంఖ్యలో DEO కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యకర్తలు మహేష్, యశ్వంత్, ధర్మేంద్ తదితరులున్నారు.