
జయ్ న్యూస్, ఆర్మూర్:
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ వి. బాలకిష్టా రెడ్డి చేతుల మీదుగా కృతిమ మేధస్సు ద్వారా బోధన తరగతుల ప్రారంభోత్సవం…..
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో మంగళవారం సాయంత్రం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ వి. బాలకిష్టా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన శ్రీ భాషిత పాఠశాలలో కృత్రిమ మేధస్సు ద్వారా విద్యా బోధన తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకిష్టా రెడ్డి పదవ తరగతి విద్యార్థులతో విద్యా ప్రాముఖ్యత గురించి ముచ్చటించారు. సాంకేతిక లాభాలను గొప్పగా ఉపయోగించుకొని రానున్న బోర్డు పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్బోధించారు.
అనంతరం శ్రీ భాషిత ఉపాధ్యాయురాళ్ళతో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని పేర్కొన్నారు. ఈ వృత్తిలో బాగా రాణించి ఒక ఉత్తమ సమజాన్ని స్థాపించాలని, దానికి మనము ఎప్పుడు కాలానుగుణంగా శిక్షణా మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. లేనిచో మనము సమాజంలో వెనుకబడుతామని, చివరకు గుర్తింపు లేకుండా మరుగున పడతామని అన్నారు. శ్రీ భాషిత పాఠశాలలో
భవిష్యత్తులో అవసరమయ్యే, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు విద్యార్థులకు ఇవ్వడం గొప్ప విషయం అని, ఇటువంటి పాఠశాలల వల్ల, విద్యార్ధులకే కాకుండా టీచర్స్ లో కూడా విద్యాబోధన, అభ్యసన చాలా గొప్పగా ఉండనుందని చెప్పారు.
ఇంత మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్ ఫామ్ ను విద్యార్థులకు అందిస్తున్న శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమై, అంతేకాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన మెలకువలని వివరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకు ఉపాధ్యాయినీ, ఉపాద్యాయులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.