
జయ్ న్యూస్, నందిపేట్: నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి తిరుమలపుడి రవికుమార్ శుక్రవారం నందిపేట్ మండలం ఐలాపూర్, మాక్లూర్ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలలో అధ్యాపకులు, సిబ్బంది హాజరు, విద్యార్థుల హాజరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ లు చిన్నయ్య, గంగారామ్ ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కళాశాలలో మరింత మెరుగ్గా అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల అనంతరం కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను మరింతగా పెంచేందుకుగాను అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థిని కళాశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే అధ్యాపకులు సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారినీ ప్రోత్సహిస్తూ కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేట్ల చూడాలని అన్నారు. రెండవ సంవత్సరం విద్యార్థుల తరగతులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని అన్నారు. కళాశాలలో సిబ్బంది, అధ్యాపకుల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లతో పాటు సిబ్బంది అధ్యాపకులు పాల్గొన్నారు.