
జయ్ న్యూస్, మాక్లూర్:
రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో ఎరువుల నిల్వలు: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఎరువుల గిడ్డంగి ఆకస్మికంగా తనిఖీ
తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల సందర్శన
మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని అధికారులకు మందలింపు
నిజామాబాద్, జూలై 04 : జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన మదనపల్లి గ్రామ రైతు పి.ప్రభాకర్ ను కలెక్టర్ పలుకరించి, సరిపడా ఎరువుల అందుతున్నాయా అని ప్రశ్నించారు. తనకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుత ఖరీఫ్ లో సన్న రకం వరి ధాన్యం సాగు చేస్తున్నానని రైతు తెలిపారు. అవసరానికి సరిపడా పూర్తి స్థాయిలో ఎరువులు లభిస్తున్నాయని, ఎలాంటి కొరత లేదని సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, రైతులు ఎవరు కూడా యూరియా సహా ఇతర ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో స్టాక్ అందుబాటులో ఉందని, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నామని భరోసా కల్పించారు.
అంతకుముందు కలెక్టర్ మాక్లూర్ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ, ఆన్లైన్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించి, తహసీల్దార్ శేఖర్ కు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర అంశాల గురించి వాకబు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ జరిపించాలని, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ నర్సింహారెడ్డిని ఆదేశించారు. చిన్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 35 ఇళ్లను మంజూరు చేయగా, 16 మార్కింగ్ చేశామని, వాటిలో 4 బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. మంజూరీ పొందిన లబ్ధిదారులందరూ ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని కలెక్టర్ సూచించారు.
కాగా, అమ్రాద్ తండా కాలువ గట్టు మీద వన మహోత్సవంలో భాగంగా గత సంవత్సరం నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ వన మహోత్సవం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే, క్షేత్ర స్థాయిలో నిర్వహణను సరిగా పట్టించుకోకపోతే ఎలా అని సంబంధిత అధికారులను మందలించారు. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా పక్కాగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.