
జయ్ న్యూస్, మోపాల్:
*కంజర జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్*
*చదువే ఆయుధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి*
*విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన జిల్లా పాలనాధికారి*
నిజామాబాద్ జూలై 22 : మోపాల్ మండలం కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, బాత్ రూంలు, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. పిల్లలు ఆరు బయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, పాఠశాల ప్రిన్సిపాల్ మురళిని ఈ విషయమై ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరు బయట భోజనం ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనం ఇంకనూ తమకు అప్పగించలేదని ప్రిన్సిపాల్ తెలుపగా, ప్రాంతీయ సమన్వయకర్త (ఆర్సీఓ)ను కలెక్టర్ ఫోన్ లో సంప్రదించి, నూతన డార్మెటరీ బ్లాక్ విషయమై ప్రశ్నించారు. రేపటి లోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన భవనం విద్యార్థులకు ఉపయోగపడకపోతే ఎలా అని నిర్వాహకులపై అసహనం వెలిబుచ్చారు. పాత బాత్ రూం అస్తవస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, డార్మెటరీ బ్లాక్ లోని బాత్ రూమ్ లను విద్యార్థులు వినియోగించేలా చూడాలన్నారు. కాగా, డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన కూరగాయలకు బదులు ఇతర కూరగాయలతో కర్రీ వండడం పట్ల నిర్వాహకులను నిలదీశారు. డైట్ ప్లాన్ ను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా, పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఇచ్చారా అని పిల్లలను ప్రశ్నించగా, పర్యావరణం సబ్జెక్టు పుస్తకం పంపిణీ కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరచిన పర్యావరణం పుస్తకాలను తెప్పించి అప్పటికప్పుడు తన సమక్షంలోనే విద్యార్థులకు పంపిణీ చేయించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విద్యను ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తి నింపారు. విద్యార్ధి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.