
జయ్ న్యూస్, ధర్పల్లి: మంగళవారం నాడు మధ్యాహ్నం సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది.ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ నిజామాబాద్ ఏసిపి, ధర్పల్లి ఇన్స్పెక్టర్, ధర్పల్లి ఎస్సై, సిరికొండ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ధర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ , అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి, అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.
సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకటరెడ్డి, ధర్పల్లి సిఐ బిక్షపతి, ధర్పల్లి ఎస్.ఐ ఎం. కళ్యాణి , సిరికొండ ఎస్.ఐ జె. రామకృష్ణ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.