
జయ్ న్యూస్, బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి శ బట్టు రాజేశ్వర్ సలహా మేరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేల్పూర్ శ్రీనివాస్ మరియు కలిగోట మురళీలు మాదిరి ఎన్నికలను విద్యార్థుల చేత నిర్వహింపచేసి, విద్యార్థి ప్రతినిధిని ఎన్నుకున్నారు.నిజమైన ఎన్నికలను తలపించేలాగా నిర్వహించిన ఎన్నికలలో విద్యార్థులే ఎన్నికల సిబ్బందిగా, పోలింగ్ అధికారులుగా, రాష్ట్రపోలీసులుగా, కేంద్ర బలగాలుగా, డాక్టర్లుగా మరియు ఇతర అన్ని విధులు నిర్వహించారు. బాల్కొండ తహసిల్దార్ శ్రీధర్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బాల్కొండ మండల అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డి రానున్న స్థానిక ఎన్నికలకు ముందు ఈ మాదిరే ఎన్నికల నిర్వహించడం ద్వారా విద్యార్థులలో మంచి అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ శైలేందర్ పోలీసులుగా పనిచేసిన విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించారు. 100 మీటర్లు 200 మీటర్ల లైన్ లు వేయడం, పోలీసులు పగడ్బందీగా ఎన్నికలను నిర్వహించడం చూసి విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోటీ చేసిన విద్యార్థులతో మాట్లాడుతూ వారి మేనిఫెస్టోని అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీ బట్టు రాజేశ్వర్ రాజ్యాంగ విలువలను కాపాడుతూ, ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ, ఓటు ప్రాముఖ్యతను గుర్తిస్తూ, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. నిజమైన ఓట్ల లెక్కింపును తలపించేలాగా విద్యార్థులే కౌంటింగ్ అధికారులుగా వ్యవహరించి కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు. స్వల్ప తేడాతో పదవ తరగతికి చెందిన ముక్కా సాయిశివాణి విద్యార్థి ప్రతినిధిగా గెలుపొందినట్లు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఎన్నికల్లో పాల్గొని విధులు నిర్వహించిన విద్యార్థులు మాట్లాడుతూ ఈ మాదిరి ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకు ఎన్నికల పట్ల అవగాహన కలిగిందని జీవితంలో ఈరోజును ఎప్పటికీమర్చిపోలేమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు CRP పాల్గొన్నారు.