
జయ్ న్యూస్, నిజామాబాద్: *భారీ వర్షాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి*
*ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి*
*ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు*
*కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష*
నిజామాబాద్, జూలై 26 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతంతో పాటు కాలువలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా, ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో కొందరు జలదిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు నెలకొన్నాయని గుర్తు చేస్తూ, అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపించేలా చూస్తామని, స్థానిక పరిస్థితుల గురించి జిల్లా యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి నెలకొంటే సమర్ధవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే కంటేశ్వర్ రైల్వే కమాన్, ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడ కూడా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు.
కాగా, ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధ నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, అతిసారం వంటివి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ తో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462-220183 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు. భారీ వర్షాల పరిస్థితి గురించి వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలనుకూడా గుర్తించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ లు, చెరువులలో వచ్చి చేరుతున్న వరద జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న నిజామాబాద్ నగరంలోని 167 ఇళ్ల యజమానులకు ఖాళీ చేయాలని నోటీసులు అందించామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. విష జ్వరాలు ప్రబలిన కాల్పోల్ తండాలో వెంటనే వైద్య శిబిరం నెలకొల్పి, పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతుల్లో భరోసా కల్పించేలా అన్ని విక్రయ కేంద్రాల్లో స్టాక్ వివరాలతో కూడిన బోర్డు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.