
జయ్ న్యూస్, ధర్పల్లి: ధర్పల్లి మండలంలోని ఇండియన్ పెట్రోల్ బంకు ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలు పడి జలమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి ఓ బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో గాయాల పాలయ్యాడు.
ఈ ఘటన నేపథ్యంలో యువకులు, గ్రామస్థులు స్పందించి తక్షణమే అధికారులకు సమాచారం అందించగా, తహసీల్దార్ టి. శాంత అర్థరాత్రి సమయంలోనే స్పందించి, ఉదయం 6 గంటలకు సంబంధిత ఆర్ అండ్ బి ఏఈ అధికారిని సంప్రదించారు. వెంటనే చర్యలు తీసుకున్న ఆర్ అండ్ బి విభాగం, రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి, ప్రజలకు సురక్షిత రవాణా మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రజల అభ్యర్థనపై ఇంత వేగంగా స్పందించిన తహసీల్దార్ శాంత చొరవపై గ్రామస్థులు, యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. “అధికారులంతా శాంతలా పని చేస్తే ప్రజల సమస్యలు ఆవిరైపోతాయి” అని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజేశ్వర్, ఎంపిఓ రాజేష్, గ్రామ యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.