
జయ్ న్యూస్, మాక్లూర్:
*ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ బాధ్యత మీదే*
*వైద్యాధికారులతో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి*
*మాక్లూర్ లో విస్తృత తనిఖీలు నిర్వహించిన జిల్లా పాలనాధికారి*
నిజామాబాద్, జూలై 29 : ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యాధికారులదేనని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాక్లూర్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి సెంటర్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, శాఖా గ్రంథాలయం, సబ్ పోస్టాఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఇందిరమ్మ ఇళ్ళ ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముందుగా మాక్లూర్ పీ.హెచ్.సీని సందర్శించిన కలెక్టర్, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ , ల్యాబ్, ఇన్ పేషంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ తో పాటు, విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీబీపీ, షుగర్, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణ కోసం సగటున ప్రతిరోజు ఎన్ని రక్తపరీకలు జరుపుతున్నారు, వాటి ఫలితాలను ఎలా తెలియజేస్తున్నారని ప్రశ్నించారు. రక్త పరీక్షల నిర్వహణ వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ప్రభుత్వ బడులు, వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సమయంలో పిల్లల రక్త నమూనాలను సైతం సేకరించాలని, పీ.హెచ్.సీలలో పరీక్షలు జరిపి వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్, టీ.బీ నిర్ధారణ పరీక్షలు శత శాతం జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పాముకాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పీ.హెచ్.సీతో పాటు దీని పరిధిలోని ఆరు సబ్ సెంటర్ల ద్వారా అందించాల్సిన వైద్య సేవలు పక్కాగా ప్రజలకు అందేలా పర్యవేక్షణ జరపాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ హితవు పలికారు. మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల ఆ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
అంగన్వాడీ సెంటర్ కు ఆనుకుని ఉన్న ఎంఈఓ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించగా, పలువురు సిబ్బంది విధుల్లో లేకపోవడాన్ని గమనించి హాజరు పట్టికను తనిఖీ చేశారు. సిబ్బంది గైర్హాజరు గురించి ఇంచార్జ్ ఎం.ఈ.ఓ సత్యనారాయణను ఆరా తీయగా, సెలవులో ఉన్నారని తెలిపారు.
అక్కడినుండి కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించి, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులను పలుకరించి, అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని రైతులు తెలిపారు. గోడౌన్ వద్ద ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును ప్రదర్శించడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, శాఖా గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో అది మూసి ఉండడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించి, లైబ్రరీ ఎందుకు తాళం వేసి ఉందని నిలదీశారు. జిల్లాలోని 24 గ్రంథాలయాలు సమయ పాలన పాటించేలా పర్యవేక్షణ జరపాలని, ఇకనుండి రోజువారీ నివేదికను తనకు పంపాలని ఆదేశించారు. లైబ్రరీని తెరిపించి, అందుబాటులో ఉన్న పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్స్, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని గ్రంథాలయాలు తెరిచి ఉండేలా చూడాలన్నారు. అనంతరం సబ్ పోస్టాఫీస్ ను సందర్శించిన కలెక్టర్, ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. నగదు కొరత నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లబ్దిదారులకు సకాలంలో పెన్షన్ మొత్తాలను అందజేయాలని సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శిని వాకబు చేశారు. మంజూరీలు పొందిన ప్రతి లబ్దిదారు ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ అవసరమైన వారికి ఐకేపీ ద్వారా రుణం అందేలా చొరవ చూపాలని సూచించారు.