
జయ్ న్యూస్, నిజామాబాద్, జూలై 31 : నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగు పర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూర్ లలో నిర్మిస్తున్న ఈ.ఎల్.ఎస్.ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనుల ప్రగతి గురించి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని, ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కాలూర్ లో ట్యాంక్ నిర్మిస్తున్న ప్రాంతానికి ఆనుకుని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నందున, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని, సరిపడా సంఖ్యలో కూలీలను వినియోగిస్తూ నిర్విరామంగా పనులు జరిపించాలని, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దుబ్బ ప్రాంతంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ విస్తరణ పనులను పరిశీలించారు. పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టర్ గుత్తేదార్లను నిలదీశారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, పైప్ లైన్ విస్తరణతో పాటు నల్లా కనెక్షన్ల నూతన పైప్ లైన్ పనులను కూడా ఏకకాలంలో సమాంతరంగా చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఖలీల్ వాడి, అహ్మదిబజార్ సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ యార్డులను కలెక్టర్ సందర్శించి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువు లోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత గంజును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తేగా, తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం నాగారంలోని రాజీవ్ గృహకల్ప భవన సముదాయాలను పరిశీలించారు. లబ్దిదారులకు వాటిని కేటాయించేలా అవసరమైన మరమ్మతులు చేయించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆకతాయిలు, అసాంఘిక శక్తులను నిలువరించేందుకు వీలుగా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నాగారం శివారులోని డంపింగ్ యార్డును సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభం అవుతుందని అన్నారు. మరింత పెద్ద మొత్తంలో కంపోస్ట్ తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
ఓ
*బస్తీ దవాఖాన, పాఠశాల ఆకస్మిక తనిఖీ*
కాగా, ఖానాపూర్ లోని కమ్యునిటీ హాల్ లో కొనసాగుతున్న బస్తీ దవాఖానాను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్సల కోసం వచ్చిన రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పీ.హెచ్.సీ తరహాలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ, సరిపడా ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. కాగా, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన వ్యర్ధాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతంలో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్సినరేటర్ జిల్లాలో అందుబాటులో ఉన్నందున బయో వేస్టేజ్ ప్రక్రియ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కాలూర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి, మధ్యాహ మద్యాహ్న భోజనం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. మెనూలో పొందుపర్చిన విధంగా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని హెచ్.ఎంకు సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఈ.ఈ మురళీమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.