
జయ్ న్యూస్, నిజామాబాద్:
*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి*
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల బయటకు ఎవరూ రాకూడదని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, తక్షణ పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రమాదం ఎదురైనా, లేక అత్యవసర పరిస్థితులు ఏర్పడి సహాయక చర్యలు అవసరమైన పక్షంలో కలెక్టరేట్ లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 – 220183 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు.