
జయ్ న్యూస్, నిజామాబాద్, ఆగస్టు 11 : మోపాల్ మండలం బోర్గాం(పీ) గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (పల్లె దవాఖాన), శాఖా గ్రంథాలయం, సొసైటీ ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, సిబ్బంది హాజరును పరిశీలించారు.
ఈ హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీస్తూ, రికార్డులను తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్, ఏ.ఎన్.సీ చెకప్ లు, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర సేవలను ప్రజలు సదివినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టే ఆరోగ్య శిబిరాలు, ఇతర వైద్య సేవా కార్యక్రమాల గురించి ముందస్తుగానే ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరికైనా సీజనల్ వ్యాధులు సోకితే తగిన చికిత్సలు అందిస్తూ, ఇతరులకు సోకకుండా పరిసర ప్రాంతాలను ఫాగింగ్ జరిపించాలని అన్నారు. కాగా, హెల్త్ సెంటర్ కు నూతన భవనం మంజూరైనందున, త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హెల్త్ సెంటర్ పక్కనే నిర్వహిస్తున్న శాఖా గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. తాత్కాలిక భవనంలో ఇరుకిరుకు గదులలో లైబ్రరీ కొనసాగుతుండడాన్ని గమనించి, సమీపంలోనే మరో భవనంలో దీనిని మార్చాలని, పాఠకులకు అనువుగా ఉండేలా చూడాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఆదేశించారు. లైబ్రరీలో సమయ పాలన విధిగా పాటించాలని, అన్ని రకాల పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించి, ఎరువుల స్టాక్ పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి కొరత ఏర్పడలేదని సొసైటీ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును అందరికీ కనిపించేలా ఎరువుల విక్రయ కేంద్రాల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.