
జయ్ న్యూస్: నిజామాబాద్, ఆగస్టు 11 : 01 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్గాం(పీ) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నులి పురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నాలుగు లక్షల మంది 01-19 వయస్సు కలిగిన బాలబాలికలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడిలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే, ఈ నెల 18న మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్బెండజోల్ మాత్ర వేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా వైద్య, విద్యా శాఖతో పాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతియేటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో రెండు పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కాగా, విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాలు తినే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. 1009 మంది విద్యార్థిని,విద్యార్థులు కొనసాగుతున్న బోర్గాం(పీ) ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహణ గురించి ప్రజల్లో ఎంతో సదభిప్రాయం ఉందని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని కలెక్టర్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ఇంకనూ పెద్ద మొత్తంలో సదుపాయాలు కావాల్సి ఉన్న పక్షంలోనూ రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాల మెరుగుదలకు చొరవ చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.