
జయ్ న్యూస్, నందిపేట్: నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో నిన్న మధ్య రాత్రి రెండు డీజే సిస్టంలు పరిమితికి మించి సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది చేయగా, డీజే లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చామని రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. డీజే నడిపిన వ్యక్తులపై, డీజే ఓనర్లపై, గణేష్ మండలి ఆర్గనైజర్ల మీద కేసు నమోదు చేశామన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు కాపాడేందుకు నందిపేట్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డిజె సౌండ్ పరిమితిని మించడం, మద్యం సేవించడం, అల్లర్లు చేయడం వంటి చట్ట విరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి భావంతో, సాంప్రదాయబద్ధంగా మరియు శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. సమాజంలో శాంతి భద్రతను కాపాడేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.