జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్, అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోస్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోస్ ఐ.జీ, కలెక్టర్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఐ.జీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విరామం లేకుండా అనునిత్యం, ప్రతి క్షణం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం అయి ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ఎదుర్కొంటారని ఐ.జీ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే పోలీసు వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను వృధా కానివ్వమని, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా అందాలంటే శాంతిభద్రతలు నెలకొని ఉన్నప్పుడే సాధ్యపడుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అనన్యసామాన్యమైనవని కొనియాడారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఎలాంటి విపత్తు సంభవించినా, ముందుగా స్పందించేది పోలీసులేనని గుర్తు చేశారు. పండుగలు, వీ.వీ.ఐ.పీల పర్యటనలు ఇలా ఏ రకంగా చూసినా పోలీసులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని కలెక్టర్ శ్లాఘించారు. మన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో ఎంతో చాకచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ, నేరస్థుల ఆటకట్టిస్తున్నారని అన్నారు.
పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డి. సి. పి ( ఎ. ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సిసిఎస్ , ట్రాఫిక్, సి.టి.సి ఏసీపీలు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ , సీఐలు, ఎస్.ఐలు , పోలీసు సిబ్బంది , అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
