జయ్ న్యూస్, మాక్లూర్:
*మాక్లూర్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్*
*గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన*
నిజామాబాద్, అక్టోబర్ 23 : మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కేజీబీవీ స్కూల్ ను సందర్శించి, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజులలో మాంసాహారం, అరటి పండ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకబు చేశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కాగా, పాఠశాలలో తుది దశలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయించాలని ఏ.ఈ ఉదయ్ కిరణ్ కు సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ శేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు ఉన్నారు.
*ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన*
కాగా, మాక్లూర్ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆర్.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం నిల్వలను పరిశీలించి, రికార్డులలో పొందుపర్చిన వివరాలను తనిఖీ చేశారు. నిర్దేశించిన విధంగా వివరాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, సంబంధిత అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా కొనసాగేందుకు వీలుగా అవలంభించాల్సిన పద్ధతుల గురించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. వర్షాలు కురిస్తే ధాన్యం తదిచిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని అన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన వెంటనే మిల్లులకు తరలించి, ట్రక్ షీట్లు తెప్పించుకోవాలని, వేగంగా ట్యాబ్ ఎంట్రీలు జరిపించాలని ఆదేశించారు.
