
జయ్ న్యూస్, నందిపేట్: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) రాష్ట్ర ప్రథమ మహాసభల కరపత్రాలను నందిపేట్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా నాయకులు పాశం సాయన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల వస్తువుల ధరల పెరగడం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరుగకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయన్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దుచేసే కుట్రలను కేంద్రప్రభుత్వం చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి, 4 లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నదన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభ 2వ రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభలకు టీయుసీఐ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు మౌనిక, లహరి,కవిత, రాణి, దేవకి, శోభ, ముత్తమ్మ, వసంత, మానస, గౌర,సాయమ్మ, సునీత, లత, సవీత,మంజుల,చిన్నక్, సుజాత,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.