
జయ్ న్యూస్, ఆర్మూర్:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష
సీజనల్ వ్యాధుల నియంత్రణ, వనమహోత్సవం, ఎల్ఆర్ఎస్ అనుమతులపై అధికారులకు దిశా నిర్దేశం
నిజామాబాద్, జూలై 02 : పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించి, పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా, కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయని అధికారులు, వార్డు ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని నిలదీశారు. అలసత్వ వైఖరిని వీడాలని, ఇకనైనా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని అన్నారు. ఇల్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టేలా అవసరమైన తోడ్పాటును అందించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆర్ధిక స్థోమత లేని లబ్దిదారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేలా చొరవ చూపాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళా సంఘాలలో సభ్యులుగా లేనట్లయితే, వారిని సభ్యులుగా చేర్పించి రుణాలు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారికి మూడు రోజులలో, కొత్తగా సభ్యత్వం కల్పించే వారికి వారం వ్యవధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. తాను వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు.
కాగా, పచ్చదనాన్ని పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్ లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ, పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, మూడు మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ ల కోసం వినియోగించాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబుషియా చేప పిల్లలు వదలాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థలలో విధిగా డ్రై డే పాటించేలా చూడాలన్నారు. ఎక్కడైనా మలేరియా, విష జ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదు అయితే, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన క్రమబద్దీకరణ అనుమతి మంజూరు చేయాలన్నారు. రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించేలా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పోర్టల్ లో లబ్దిదారుల వివరాలు వెంటదివెంట అప్డేట్ చేయాలని అన్నారు.
సమీక్ష అనంతరం కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని 11, 12 వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులను వారి నివాసాల వద్దకు వెళ్లి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే, మెప్మా ద్వారా రుణం ఇప్పిస్తామని, ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తామని, ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంట వెంటనే రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.