
జయ్ న్యూస్, నిజామాబాద్: జూలై 05 : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డు కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు హితవు పలికారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు.
ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జూలై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకొని, ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినాన్ని నిర్వహించి తహసిల్దార్, పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. జిల్లాలోని సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా మూడు మాసాలకు ఒకసారి డివిఎంసి సమావేశాలు నిర్వహించి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మూఢ నమ్మకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన చట్టాలపై, అవి అందరికీ సమానమనే విషయాన్ని అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా అంకిత భావంతో పని చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పక్కాగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలలో కూడా వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరేలా చూడాలన్నారు. కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురి చేసే వారి పట్ల కమిషన్ కఠిన చర్యలు చేపడుతుందని అన్నారు. కాగా, అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నోట్ బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, ఏకరూప దుస్తులు అందేలా చూడాలన్నారు.
అంతకుముందు ఐడీఓసీ కి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్, జిల్లా అధికారులు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.