
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆల్ఫోర్స్ నరేంద్ర స్కూల్ లో మంగళవారం ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనపు కుండలను అలంకరించి వాటిలో బోనాన్ని పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి, బోనాలు ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, శివసత్తుల మరియు పోతరాజుల వేషధారణలతో అందర్నీ ఆకట్టుకున్నారు.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, మన సాంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటారని, విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారని అన్నారు. పాఠశాల అంటే ర్యాంకులు మాత్రమే కాదని, విద్యార్థులకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించేందుకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ విద్యాసంస్థల్లో అన్ని రకాల పండుగలను విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలో ఇటీవలే హౌస్ ఎలక్షన్స్ నిర్వహించామని, గెలుపొందిన కెప్టెన్లను బాధ్యతలు అప్పగించామని, విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలను వెలికితీయడం కోసం హౌస్ ఎలక్షన్స్ నిర్వహించామని అన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మా పాఠశాల యాజమాన్యం ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అన్ని విధాలుగా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.