
జయ్ న్యూస్, నిజామాబాద్: జూలై 18 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై, ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్ షాప్ లను సందర్శించి, పనితీరును పరిశీలించారు. విద్యార్థిని, విద్యార్థులతో భేటీ అయ్యి, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెకానికల్, సివిల్స్ తదితర వర్క్ షాప్ లలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు.
సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సులలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే, విద్యార్థిని, విద్యార్థులు చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది, సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పర్చుకుంటే, యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ, అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే, వాటిని సవరించుకుని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని సూచించారు.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలలో సైతం నెగ్గుకురావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆయా సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించేలా విద్యార్థిని, విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. డిప్లొమా అనంతరం పై చదువులు చదివే వారికి మంచి ప్లేస్ మెంట్ లతో కూడిన ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని హితవు పలికారు. ఇకనుండి తాను క్రమం తప్పకుండా ప్రతి మూడు మాసాలకు ఒకసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ, ఫలితాల సాధనపై సమీక్ష జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, బోధనా సిబ్బంది ఉన్నారు.