
జయ్ న్యూస్ ఆర్మూర్: తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియాను సకాలంలో అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బీసీ సెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తున్న ప్రస్తుత కష్టకాలంలో రైతులకు భరోసా ఇస్తూ బాధ్యత వహించాల్సిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు తమకేం పట్టదన్నట్లుగా మౌనంగా ఉంటూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియాను సకాలంలో సరఫరా చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనీ, తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని దోండి రమణ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటల దిగుబడి తగ్గి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు వెంటనే కేంద్ర ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడిని పెంచి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ విజ్ఞప్తి చేశారు. 15వ తేదీ సెప్టెంబర్ నాడు కామారెడ్డి లో జరగబోయే బహిరంగ సభను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు బీసీ బిడ్డలంతా పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.