జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల 9 కుటుంబాలకు డీ.జీ.పీ బి.శివధర్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలతో కలిసి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 1989 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతోందని డీ.జీ.పీ వెల్లడించారు. మిగతా 9 కుటుంబాలు కూడా ముందుకు వస్తే, వారికి సైతం అదే ప్రాంతంలో నివేశన స్థలాలు అందించడం జరుగుతుందని సూచించారు. ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డీ.జీ.పీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమవుతూ ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉంటూ వస్తున్న పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గాజులరామారంలో 200 గజాల చొప్పున ఇళ్ళ స్థలాలను పంపిణీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. 2008లో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న దుస్సంఘటనలో 33 మంది పోలీసులు అమరులయ్యారని డీ.జీ.పీ గుర్తు చేశారు. ఆ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నివేశన స్థలాలను అందించి, పోలీసు అమరుల త్యాగాలను స్మృతి పథంలో నిలిచిపోయేలా తోడ్పాటును అందించిందని అన్నారు.
